అయ్యప్ప మాల ధారణలో ఉన్న భక్తులకు శుభవార్త. కేరళలోని పంపా నదీ తీరాన ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయం నేటి నుంచి భక్తుల కోసం తెరుచుకోనుంది. ఈరోజు సాయంత్రం ధర్మ శస్త ఆలయాన్ని తెరిచి మండల పూజ జరపనున్నారు. ఆలయ తంత్రి కండరారు రాజీవరు సమక్షంలో ప్రధాన పూజారి ఎన్.పరమేశ్వరన్ నంబూద్రి గర్భగుడి తలుపులు తెరవనున్నారు. అనంతరం అయ్యప్ప కు ప్రత్యేక పూజలు జరిపి, ఆచార సంప్రదాయాల అనంతరం భక్తులను ఆలయం లోనికి అనుమతిస్తారు. వార్షిక మండలం-మకరవిళక్కు పవిత్ర యాత్ర నవంబరు 17 నుంచి షురూ అవుతుంది. 41 రోజుల పాటు కొనసాగే మండల దీక్ష డిసెంబరు 27న ముగియనుంది. అనంతరం, డిసెంబరు 30న అయ్యప్ప ఆలయం తిరిగి తెరుచుకోనుంది. అక్కడ్నించి జనవరి 14 వరకు మకరవిళక్కు దీక్షలు చేపట్టిన భక్తుల యాత్ర కొనసాగుతుంది. జనవరి 20న ఆలయం మూసివేస్తారు. దాంతో అయ్యప్ప భక్తుల సీజన్ ముగుస్తుంది.