చిన్నమ్మ శశికళ స్వాగతానికి  భారీ ఏర్పాట్లు

By udayam on November 20th / 7:45 am IST

చెన్నై: కోర్టు విధించిన జరిమానా చెల్లింపు ప్రక్రియ పూర్తవ్వడంతో జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ విడుదలకు రంగం సిద్ధమైందని అంటున్నారు.

ఒకటి రెండు రోజుల్లో ఆమె విడుదలవుతారని వార్తలు వస్తున్నాయి. దీంతో అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు ఆమెకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి సారించాయి.

చిన్నమ్మ విడుదలకు కోర్టు విధించిన రూ.10 కోట్ల 10 లక్షల జరిమానాను ఆమె తరఫు న్యాయవాదులు చెల్లించి, ఇందుకు తగ్గ రశీదులు, చిన్నమ్మ జైలు జీవితం, విడుదలకు తగ్గ విజ్ఞప్తితో కూడిన ఓ పిటిషన్‌ను ఆమె తరఫు న్యాయవాదులు ఇప్పటికే  బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వర్గాలకు సమర్పించారు.

దీంతో చిన్నమ్మ  ఒకటి రెండు రోజుల్లో జైలు నుంచి వచ్చేస్తున్నారని ఆమె న్యాయవాది రాజాచెందూర్‌ పాండియన్‌ చెబుతున్నారు.

అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాల్లో ఎదురు చూపులు పెరిగాయి. కళగం ముఖ్యనేతలు మాత్రమే బెంగళూరుకు వెళ్లగా, మిగిలిన నేతలందరూ తమిళనాడు– కర్ణాటక సరిహద్దుల్లో ఉండి, చిన్నమ్మకు ఆహ్వానం పలికేందుకు తగ్గట్టుగా కార్యాచరణ సిద్ధం చేశారు.

హొసూరు నుంచి చెన్నై వరకు జాతీయరహదారిలోని కొన్ని ఎంపిక చేసిన పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద చిన్నమ్మకు స్వాగతం  పలకబోతున్నాయి.