న్యూఢిల్లీ: రిపబ్లిక్ డేన రైతులు నిర్వహించ తలబెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై ఇన్జంక్షన్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు వేసిన పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టు ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.
ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున హాజరైన కేకే వేణుగోపాల్ తమ వాదన వినిపిస్తూ, రైతుల ర్యాలీ చట్టవిరుద్ధమవుతుందని, ఢిల్లీలోకి 5000 మంది ప్రజలు అడుగుపెట్టే అవకాశం ఉందని చెప్పారు.
దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, ఢిల్లీలోకి ప్రవేశమనేది శాంతి భద్రతల పరిస్థితే అయితే దానిని నిర్ధారించుకోవాల్సింది పోలీసులేనని స్పష్టంచేసింది.
తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా తాము ప్రశాంతంగా ర్యాలీ నిర్వహిస్తామని రైతులు ఇప్పటికే ప్రకటించారు.