కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు సుప్రీంలో జరిగిన వాదోపవాదనలను విన్న కోర్టు ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలో భయంకరమైన వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా ధర్నా చేస్తున్న రైతుల బాధను కేంద్రం అర్ధం చేసుకోవడంలో విఫలమైందని నిన్న వ్యాఖ్యానించిన సుప్రీం.. ఈరోజు తాజా తీర్పును వెలువరించింది.
సుప్రీం చీఫ్ జస్టిస్ ఎస్ ఎ బాబ్డేతో పాటు ధర్మాసనంలోని మిగతా ముగ్గురు సభ్యుల న్యాయమూర్తులు సైతం కొత్త చట్టాలపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు.
కొత్త చట్టాలపై కూలంకషంగా నివేదికను అందించాలని సుప్రీం పేర్కొంటూ.. భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి హెచ్.ఎస్.మన్, అంతర్జాతీయ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌత్ ఆసియా డైరెక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, వ్యవసాయ ఆర్ధిక వేత్త అశోక్ గులాటి, శేట్కారి సంఘటన్ ప్రతినిధి అనిల్ ధన్వంత్లతో కూడిన నలుగురు సభ్యుల కమిటీని నియమించింది.
‘‘మేం ఈ సమస్యను వీలైనంత సుహృద్భావ వాతావరణంలోనే పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నాం. ఈ చట్టాలను రద్దు చేయడానికి మాకున్న హక్కుల్ని ఈ సందర్భంగా ఉపయోగించి ఈ చట్టాలపై స్టే విధిస్తున్నాం” అని తీర్పులో చీఫ్ జస్టిస్ ఎస్ ఎ బాబ్డే వెల్లడించారు.