గ్రేటర్​ ప్రచారానికి స్టార్లు సిద్ధం

By udayam on November 21st / 9:20 am IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచార కార్యక్రమాలు హోరెత్తించడానికి వివిధ పార్టీల నుంచి స్టార్‌ క్యాంపెయినర్లు సిద్ధం అవుతున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి విజయం సాధించడంతో అన్ని పార్టీలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమరోత్సాహంతో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి.

ప్రచారానికి తక్కువ సమయం ఉన్నా సరే, వీలైనంత మేరకు సుడిగాలిలా ప్రచారం సాగించాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. ప్రచారకర్తలను ఖరారుచేసి, ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు జాబితాలను పంపారు.

టిఆర్​ఎస్​ నుంచి వీరే..

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ నుంచి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, మహ్మద్‌ మహమూద్‌ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రా రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్‌ స్టార్‌ క్యాంపెయినర్లుగా ఉంటారని ఎస్‌ఈసీకి టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాసరెడ్డి జాబితా అందించారు.

బిజెపి నుంచి క్యాంపెయినర్లు ఎవరంటే?

ఇక దుబ్బాక ఎన్నిక గెలుపుతో జోష్ మీదున్న బీజేపీ తరపున ప్రచారకర్తలు సిద్ధం అయ్యారు. ఆ పార్టీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, మాజీ ఎంపీలు వివేక్‌ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఎం. రఘునందన్‌రావు, ఎంపీ ధర్మపురి అరవింద్‌ స్టార్‌ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తారని ఎన్నికల కమిషన్‌కు బీజేపీ జాబితా సమర్పించింది.

కాంగ్రెస్​ నుంచి వీరు

కాగా దుబ్బాకలో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్‌ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు ఎ.రేవంత్‌రెడ్డి , పొన్నం ప్రభాకర్, మహ్మద్‌ అజహరుద్దీన్, జెట్టి కుసుమకుమార్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు, మాజీ మంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్, మాజీ ఎంపీ, గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌ ప్రచారం చేస్తారని ఎస్‌ఈసీకి ఆ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్‌ జి.నిరంజన్‌ లేఖ సమర్పించారు.