నల్లగొండ : నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజీ సమీపంలోని హైదరాబాద్ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం దారుణ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా ఆరుగురు దుర్మరణం పాలవ్వగా, చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు.
ఇంకా 11 మంది గాయాలతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతుండగా, ఇందులో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది.
దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన 20 మంది కూలీలు పెద్ద అడిశర్లపల్లి మండలం రంగారెడ్డిగూడెం, పోతునూరు గ్రామాల్లో వరి నాట్లు వేసేందుకు ఆటోలో వెళ్లి, సాయంత్రం వరకు వరినాట్లు వేసి, అదే ఆటోలో తిరుగు ప్రయాణ మయ్యారు.
ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఓవర్టేక్ చేయబోయింది.
సరిగ్గా అప్పుడే ఎదురుగా కూలీలు వెళ్తున్న ఆటోను లారీ వేగంగా ఢీ కొట్టింది.
బొలోరో వాహనం కూడా అదుపుతప్పి బోల్తాపడింది. అతి వేగంగా ఆటోను లారీ ఢీకొనడంతో అందులో ఉన్న కూలీలంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఆటో డ్రైవర్ తో సహా 6గురు దుర్మరణం చెందారు.
మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఓవర్లోడ్పై ప్రజలకు అవగాహన ఉండాలని, తాము వాహనాలపై తనిఖీలు చేస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.