భోగిమంటల్లోనూ ఆందోళన – జీవోల దగ్ధం

'భోగి మంటలు కారాదు... అమరావతి చితి మంటలు' : రాజధాని రైతులు

By udayam on January 13th / 5:34 am IST

అమరావతి: ఈసారి భోగి మంటలు కూడా ఆందోళనకు వేదిక అయ్యాయి. కృష్ణా జిల్లాలోని  పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ జారీ చేసిన ప్రజా వ్యతిరేక జీఓ కాపీలను చంద్రబాబు భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.

అనంతరం పిల్లలకు బోగిపళ్ళు పోసి పలు సాంసృతిక కార్యక్రమాలను బాబు తిలకించారు. ఈ వేడుకల్లో  ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణ, నేటం రఘురాంతో భారీగా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు భోగిమంటల్లో ప్రభుత్వ  ప్రజావ్యతికరేక జీవోలను దగ్ధం చేసి ఆందోళనలో పాల్గొన్నారు.

‘భోగి మంటలు కారాదు….అమరావతి చితి మంటలు’

భోగి  పండుగ సందర్బంగా  అమరావతిలోని తుళ్లూరులో ఈరోజు ఉదయం  రాజధాని గ్రామాల రైతులు, మహిళలు భోగి మంటలు వేశారు. ‘నేటి భోగి మంటలు కారాదు….అమరావతి చితి మంటలు’ పేరుతో భోగి మంటలు అంటూ రాజధాని రైతులు భోగి మంటలు వేశారు.

అనంతరం రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. రైతులను విభజించి పాలించాలని కొన్నిగ్రామలను తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలలో కలుపుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ…. ఆ ఆర్డినెన్స్ కాపీలను అమరావతి రైతులు భోగి మంటల్లో వేశారు.

కేంద్ర వ్యవసాయ చట్టాల ప్రతుల దగ్ధం …

కాగా  ఢిల్లీలో రైతుల దీక్షలకు మద్దతుగా రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో  నిరసన చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేసి ఆందోళన‌కు దిగారు.

బాపులపాడు మండల కేంద్రంలో సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని.. కేంద్రం మొండి వైఖరి నసించాలని కోరుతూ రైతు సంఘ నేతల నినాదాలు చేశారు.

విశాఖలో సిపిఐ వినూత్న నిరసన …

పట్టణ సంస్కరణ ముసుగులో ప్రజలపై భారాలను వేయడాన్ని నిరసిస్తూ విశాఖపట్నం సీపీఐ వినూత్న నిరసన చేపట్టింది.  ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలు, పన్నుల పెంపు జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి ఆస్తి విలువపై ఇంటి పన్ను విధానాన్ని రద్దు చేయాలని.. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసారు.