గ్రేటర్ ఎన్నికల్లో టీచర్లకు డ్యూటీలు లేవు

By udayam on November 21st / 5:19 am IST

హైదరాబాద్‌: ఎక్కడ ఎన్నికలు జరిగినా టీచర్స్ కి డ్యూటీలు పడుతుంటాయి. కానీ డిసెంబర్‌ 1న జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధుల కోసం టీచర్స్ ని వినియోగించడం లేదు.

ఉపాధ్యాయులు (బోధన సిబ్బంది) మినహా ఇతర అధికారులు, సిబ్బంది జాబితా పంపించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు.

జీహెచ్‌ఎంసీ 150 డివిజన్ల పరిధిలోని 9,235 కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు.  ఒక్కో కేంద్రానికి ఒక ప్రిసైడింగ్‌ అధికారి (పీఓ), సహాయ ప్రిసైడింగ్‌ అధికారి (ఏపీఓ), ఇద్దరు ఇతర పోలింగ్‌ సిబ్బంది (ఓపీఓ) కలిపి మొత్తం 36,940 మంది కావాలి.

అత్యవసర సేవల్లో పనిచేయడానికి అదనంగా 30 శాతం అనగా 11,082 మంది రిజర్వు సిబ్బంది అవసరం. ఎన్నికల సిబ్బందికి కనీసం రెండు శిక్షణ తరగతులు నిర్వహించాల్సి ఉంది.

సమయం లేనందున తక్షణమే జాబితాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు పంపాలని అర్వింద్‌కుమార్ ఆదేశించారు. సచివాలయంతోపాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధుల్లో నియమించాలని నిర్ణయించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని ప్రభుత్వశాఖలకు లేఖలు రాశారు.

సచివాలయం, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది జాబితాను ఎన్నికల విధుల కోసం తక్షణమే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు పంపించాలని ఆదేశించారు.