భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలోని దండాలపాడు శివారు ఎర్రబోడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రేంజరు చలమల శ్రీనివాసరావుపై గొత్తికోయలు వేట కత్తి, గొడ్డలితో దాడి చేయడంతో ఆయన మరణించారు. దాడికి గురైన వెంటనే శ్రీనివాసరావును మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఫారెస్ట్ రేంజర్ మరణించారు. చండ్రుగొండ మండలం అబ్బుగూడెం సమీపంలో గల ఎర్ర బోడు వద్ద గల అటవీశాఖ ప్లాంటేషన్‌లోని మొక్కలను గొత్తికోయలు నరుకుతుండగా సెక్షన్ ఆఫీసర్ రామారావుతో కలిసి అక్కడకు ద్విచక్రవాహనంపై వెళ్లిన రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు వారిని అడ్డుకోవడంతో వారు దాడి చేసినట్లు తెలుస్తోంది.