రన్నింగ్ కామెంట్రీ ‘దేవిప్రియ’ కన్నుమూత

By udayam on November 21st / 8:04 am IST

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ కన్నుమూశారు.

తెలుగు సాహితీలోకానికి దేవిప్రియగా సుపరిచితులైన షేక్‌ ఖాజా హుస్సేన్‌ నవంబర్​ 6 నుంచి అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

అప్పటికే దేవిప్రియ ఎడమ కాలికి ఇన్‌ఫెక్షన్‌  కావడంతో తొమ్మిదో తేదీన అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ఆరోగ్యం నిలకడగా ఉందనుకుంటున్న సమయంలో, రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో మరికొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

కవిగా, పాత్రికేయుడిగా, సినీగేయ రచయితగా మంచిపేరున్న దేవీప్రియ గుంటూరు జిల్లా పల్నాడులోని ఓబులేశునిపల్లెలో జన్మించారు. ఉదయం, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఆయన  కార్టూన్‌ కవితలు ‘రన్నింగ్‌ కామెంట్రీ’ పాఠకలోకం మన్ననలు అందుకున్నాయి.

‘అమ్మచెట్టు’, ‘నీటిపుట్ట’, ‘చేప చిలుక’, ‘తుఫాను తుమ్మెద’, ‘సమాజానంద స్వామి’, ‘గరీబు గీతాలు’, ‘గాలిరంగు’, ‘గంధకుటి’ తదితర కవితా సంపుటిలతో పాటు పలు రేడియో, రంగస్థల నాటికలు, సినిమా పాటలు రచించారు.

గాలి కవితకు అకాడమీ అవార్డ్​

“గాలిరంగు” కవిత్వానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. దేవిప్రియ సినీరంగంలో ప్రస్థానాన్ని ప్రారంభించి జర్నలిజంలో స్థిరపడ్డారు. ఆయన మృతి పట్ల తెలుగు సాహితీ ప్రపంచం సంతాపం ప్రకటించింది. పలువురు సాహితీప్రముఖులు నివాళులర్పించారు.

సీఎం కేసీఆర్ సంతాపం

దేవీప్రియ మృతిపట్ల తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. దేవీప్రియ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేవీప్రియ సాహిత్య ప్రతిభకు “గాలిరంగు” రచన మచ్చుతునకగా వర్ణించారు.