పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో పలు పలు బ్యాంకుల్ని దాదాపు 9 వేల కోట్ల రూపాయలకు ముంచేసి లండన్‌లో దాక్కున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇప్పట్లో భారత్ తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది. అతడు తల దాచుకుంటున్న యుకె లోనూ అతడిపై చాలా లీగల్ కేసులు పెండింగ్‌లో ఉండడంతో అక్కడి ప్రభుత్వం అతడిని ఇప్పట్లో భారత్‌కు అప్పగించే అవకాశాలు కనిపించడం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
విజయ్ మాల్యా కేసుకు సంబంధించి తర్వాతి కోర్టు ప్రొసీడింగ్స్ ఈ ఏడాది మార్చ్ 15న జరగాల్సి ఉండగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరింత సమయం కావాలంటూ కోర్టుకు వెల్లడిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు.
ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తుషార్‌కు పంపిన లేఖను సైతం సుప్రీంకోర్టుకు అందించారు.
కేంద్రం వీలైనంత త్వరగా అతడిని స్వదేశానికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడి కోర్టు దానిని అడ్డుకుంటోందని వెల్లడించారు.