జులై 17 వరకూ యూకేలో లాక్ డౌన్

By udayam on January 24th / 6:22 am IST

లండన్: ఏడాది గడుస్తున్నా కరోనా తీవ్రత రూపాలు మార్చుకుంటూనే ఉంది. ఇప్పటికే బ్రిటన్ దేశంలో ప్రబలిన కరోనా స్ట్రెయిన్ వైరస్ పాత కరోనా జాతి కంటే ఎక్కువ ప్రాణాంతకమని తేలింది.

ఈమేరకు బ్రిటీష్ ప్రభుత్వ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్యాట్రిక్ వాలెన్సు హెచ్చరించారు. పాత కరోనా వైరస్ వల్ల వెయ్యిమందిలో 10 మంది మరణిస్తుంటే, కొత్త కరోనా వేరియెంట్ వల్ల వెయ్యి మందిలో 14 దాకా మరణిస్తున్నారని తేలింది.

కరోనా కొత్త స్ట్రెయిన్ వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో బ్రిటీష్ ప్రభుత్వం జులై 17వతేదీ వరకు లాక్‌డౌన్ ఆంక్షల చట్టాలను అమలు చేయాలని తాజాగా నిర్ణయించింది.

పబ్‌లు, రెస్టారెంట్లు, షాపులను జులై 17వ తేదీ వరకు మూసివేసే అధికారాన్ని కౌన్సిల్‌లకు ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సమీక్షలో భాగంగా బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ నివేదిక సమర్పించారు.

కరోనా ఇన్ఫెక్షన్ ను లాక్ డౌన్ ఆంక్షల అమలుతో నియంత్రించాలని నిర్ణయించినట్లు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు.

గత 24 గంటల్లో 4,600 మంది కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ తో ఆసుపత్రుల్లో చేరారు. బ్రిటన్ దేశంలో కరోనా మరణాల సంఖ్య ఒక్కరోజులో 1401 గా నమోదైంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 35,83,907.

మరణాల సంఖ్య 95,981కి పెరిగింది. బ్రిటన్ దేశానికి వచ్చే సందర్శకులు 10 రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరని ఆదేశాలు జారీ చేశారు.