బెంగళూరు: కర్ణాటకలోని ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళుతుండగా అంకోలా సమీపంలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తర కన్నడ జిల్లాకు వచ్చిన శ్రీపాద యశోనాయక్ గోకర్ణ నుంచి గోవాకు తిరిగి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఆయన సతీమణి విజయతో పాటు వ్యక్తిగత కార్యదర్శి దీపక్ మృత్యువాత పడ్డారు.
తీవ్ర గాయాలైన వారిద్దరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఇక తీవ్రంగా గాయపడిన నాయక్‌ను గోవా మెడికల్ కళాశాలకు తరలించారు.
68 ఏళ్ల శ్రీపాద నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఉత్తర గోవా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆయన ఆయుష్ మంత్రిగా, రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. కాగా మంత్రి అనుచరుడు సాయికిరణ్, కారు డ్రైవర్, గన్‌మ్యాన్, కి కూడా గాయాలయ్యాయి.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి,. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. నాయక్‌కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్‌కు సూచించారు.
అవసరమైతే ఆయనను ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకురావాలని సావంత్‌కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
ప్రమాదం పట్ల కర్ణాటక సీఎం యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ భార్య విజయ మృతిపట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతాపం తెలిపారు.