నవంబర్‌ 30 వరకు అన్‌లాక్‌ 5.0 నిబంధనలే – స్కూల్స్ పై డైలమా

By udayam on October 28th / 5:39 am IST

న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తూ సెప్టెంబర్‌లో ప్రకటించిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు నవంబర్‌ 30 వరకూ కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అయితే  కరోనా ముప్పు ఇంకా ఉన్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు 50 శాతం సీట్లతో అనుమతించడంతో సహా అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు నవంబర్‌ 30 వరకూ అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.

కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేయాలని కేంద్రం  పేర్కొంది. ప్రభుత్వం అనుమతించిన సేవలు మినహా అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత యధావిధిగా కొనసాగుతుంది. దశలవారీగా స్కూళ్లు, విద్యాసంస్ధలను తెరవడంపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది.

అన్‌లాక్‌–5 నిబంధనలను నవంబర్‌ నెలాఖరు వరకు పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్కూల్స్ తెరిచే అంశంలో మార్పులు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.  వాస్తవానికి గతంలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని తెలుగు రాష్ట్రాల్లో అధికారులు నిర్ణయించారు. ఇక కరోనా ఉదృతి కూడా శీతాకాలంలో పెరిగే ఛాన్స్ ఉందన్న నేపథ్యంలో స్కూల్స్ పై పునరాలోచన చేసే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది.