మోసగించారంటూ వందేమాతరం శ్రీనివాస్ ఫిర్యాదు

By udayam on November 21st / 5:35 am IST

హైదరాబాద్: ఇబ్బందుల్లో ఉన్నాను ఆదుకోవాలంటూ సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ వద్ద రూ. 28 లక్షలు తీసుకుని, మోసం చేసిన వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లో ఉండే వందేమాతరం శ్రీనివాస్‌.. ఉదయం వేళ వాకింగ్ కి వెళ్లేప్పుడు.. అపోలో ఆస్పత్రి సమీపంలో నివసించే తిరుపతయ్య పరిచయం అయ్యాడు.

అలా 2018 నుంచి మార్నింగ్‌ వాక్‌లో కలిసేవారు. జూన్‌లో తిరుపతయ్య కర్నూల్‌కు చెందిన తన మామ, కాంట్రాక్టర్‌ రంగస్వామితో కలిసి వందేమాతరం శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లారు. ఆర్థిక నష్టం ఏర్పడిందని, రూ. 30 లక్షలు సర్దితే.. నాలుగు నెలల్లో తిరిగి ఇచ్చేస్తామని కోరారు.

దీంతో.. వారి నుంచి చెక్కులు తీసుకున్న శ్రీనివాస్‌.. రూ.8 లక్షలు ఒకసారి.. రెండు విడతలుగా పదేసి లక్షలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మాట ప్రకారం నాలుగు నెలలు గడిచినా.. డబ్బు విషయం ఎత్తకపోవడంతో తన స్నేహితుడితో కలిసి తిరుపతయ్య ఇంటికి వెళ్లారు. డబ్బు ఎప్పుడు తిరిగిస్తావని అడిగితే.. తిరుపతయ్య నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా.. బెదిరింపులకు దిగడంతో శ్రీనివాస్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.