చాటింగ్‌ వద్దంటూ భర్త మందలించాడని సూసైడ్

By udayam on October 27th / 7:02 am IST

హైదరాబాద్: సెల్‌ఫోన్‌లో అదే పనిగా చాటింగ్‌ చేయొద్దని భర్త మందలించడంతో ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం భూదేవినగర్‌లోని వెంకటాపురం లాస్ట్‌ బస్టాప్‌ ప్రాంతంలో రోషన్‌ జమీర్‌, రోషన్‌ నహీలా (42) భార్యాభర్తలు నివశిస్తున్నారు. వీరి కుమార్తె సోన్‌ ఆఫ్రీన్‌.

ఇటీవల దంపతులిద్దరూ కొవిడ్‌-19 బారిన పడి కోలుకున్నారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల వరకు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అనంతరం భర్త రోషన్‌ జమీర్‌ నిద్ర పోయాడు.

3 గంటల సమయంలో నిద్రలో నుంచి మెలకువ రావడం, అప్పటి వరకు భార్య సెల్‌లో చాటింగ్‌ చేస్తూ కనిపించడంతో ఎక్కువగా చాటింగ్‌ చేస్తే అనారోగ్యం కలుగుతుందని, ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో విశ్రాంతి అవసరమని చెప్పి భార్య సెల్‌ ఫోన్‌ తీసుకుని బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు.

దీంతో మనస్తాపానికి గురైన రోషన్‌ నహీలా ఇంట్లోని హాల్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రోషన్‌ జమీర్‌ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో లేచి చూడగా భార్య బెడ్‌రూమ్‌లో కనిపించలేదు. హాల్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కూతురి సహాయంతో ఆమెను కిందికి దించి చూడగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. రోషన్‌ అల్వాల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.