జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతులు సంఘాలు చేయతలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని రద్దు చేసుకున్నారు.
ఈ విషయాన్ని రైతు సంఘాల తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు వెల్లడించారు. అంతకు ముందు రిపబ్లిక్ డే సందర్భంగా భారీ ఎత్తున ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి కొత్త వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసేలా కేంద్రం పై ఒత్తడి తీసుకురావాలని రైతు సంఘాలు భావించాయి.
అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సుప్రీంకోర్టులో కేంద్రం తరపున వాదనలు వినిపిస్తూ.. హర్యానాలో రైతులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని, ముఖ్యమంత్రి సభాస్థిలిని సైతం ధ్వంసం చేశారని కోర్టుకు వెల్లడించారు. అదే విధంగా ఢిల్లీలోనూ చేయాలని రైతులు భావిస్తున్నారని.. ఇందులో భాగంగానే ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించడానికి సిద్ధమయ్యారని తెలిపారు.
దీనిపై సుప్రీం చీఫ్ జస్టిస్ స్పందిస్తూ.. ‘‘మేం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వారిని రక్షించలేం. రైతులు ఎందుకు రాజ్‌పథ్ వద్ద ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలనుకుంటున్నారో మీరు చెప్పండి దవే” అంటూ రైతుల తరపున న్యాయవాదిని ప్రశ్నించారు.
చీఫ్ జస్టిస్ ప్రశ్నకు దవే సమాధానం ఇస్తూ ‘‘మేం ఆ పని చేయట్లేదు” అని వెల్లడించారు. అక్కడ 400 మంది రైతు సంఘాలతో పాటు 1,50,000 మంది రైతులు ఉన్నారు. వారు ఆ పని చేస్తారని నేను భావించట్లేదు అని దవే సమాధానం చెప్పారు.