హైదరాబాద్ : ఇటీవల హైదరాబాద్ లోటస్ పాండ్ లో నల్గొండ జిల్లా వైఎస్ అభిమానులతో భేటీ అయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తాజాగా శనివారం హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమయ్యారు.
తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న ఆమె గత గురువారం ఆమె ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. త్వరలోనే అన్ని జిల్లాల నేతలతో సమావేశమవుతానని షర్మిల ఇదివరకే ప్రకటించారు.
తెలంగాణలో ఇంకా ఆయనకు అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఈనాటి సమావేశంలో తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారా అని ఆమె ఆరా తీశారు.
స్థానిక సమస్యలపై నేతలతో చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల అమలు విధానంపై అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే తన ఆక్షాంక్ష అని షర్మిల పేర్కొన్నారు. అలాగే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి హైదరాబాద్, రంగారెడ్డి నేతలు ఆమెకు వివరించారు.